చంద్రబాబు, పురంధేశ్వరి ఇద్దరూ హంతకులే : లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు

 


ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ప్రహసనం ముగిసింది. దీంతో పార్టీల అధినేతలు, అభ్యర్ధులు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఎవరికి వారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నా.. లోలోపల టెన్షన్ నెలకొంది. దాదాపు రెండు నెలల పాటు ఎన్నికల ప్రచారం, ఇతర పనులతో క్షణం తీరిక లేకుండా గడిపిన నేతలు , వారి అనుచరగణం సేదతీరుతున్నారు. కొందరు ఫారిన్ ట్రిప్‌కు వెళ్లగా.. మరికొందరు ఆలయాలను సందర్శిస్తున్నారు. 

ఎన్నికలు ముగిసినా రాష్ట్రంలోని ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్ధం ముగియలేదు. ఏపీలో పోలింగ్ రోజు జరిగిన హింస జాతీయ స్థాయిలో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే సీఎస్, డీజీపీలను ఈసీ ఢిల్లీకి పిలిపించి, వివరణ అడిగింది. ఇదిలావుండగా.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలపై స్పందించారు మాజీ సీఎం ఎన్టీఆర్ సతీమణి నందమూరి లక్ష్మీపార్వతి. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, బీజేపీ ఏపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరిపై మండిపడ్డారు . 

చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగానే జరిగిందన్నారు. తాడిపత్రి సహా పలు ప్రాంతాల్లో అక్కడక్కడా ఇబ్బంది పెట్టారని లక్ష్మీపార్వతి ఆరోపించారు.  పల్నాడు ఏరియాలో ముందు నుంచే విధ్వంసం ప్రారంభించారని.. అధికారులు ఎక్కడైతే మారారో అక్కడే గొడవలు జరిగాయని ఆమె తెలిపారు. పోలీసులు వారికి సహకరించారని, ఎన్నికలు ముగిసిన తర్వాత దారుణంగా ప్రవర్తించారని లక్ష్మీపార్వతి మండిపడ్డారు. 

కర్రలు, కత్తులు తీసుకుని ఇళ్ల మీదకు వెళ్లిపోతున్నారని ..దొరికిన వాళ్లను దొరికినట్లుగా కొట్టారని, ఇళ్లు, కార్లు తగులబెట్టారని పేర్కొన్నారు. తనకు తెలిసి ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి పరిస్ధితులు చోటు చేసుకోలేదని.. భారతదేశంలోనే ఏపీలో హింస ఎక్కువగా జరిగిందన్నారు.  చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుగా .. ముందుజాగ్రత్తలు తీసుకుని ఉంటే ఇలాంటి పరిస్ధితులు తలెత్తేవి కాదన్నారు. మంచి అధికారులను తీసేసి పనికిమాలిన వెదవలను పెట్టారని.. వాళ్లంతా వృత్తి ద్రోహం చేసేవాళ్లని లక్ష్మీపార్వతి ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

పోలింగ్ అద్భుతంగా జరిగిందని కితాబిచ్చారు. అధికారులను మార్చాల్సిందిగా ఓ జాబితాను టీడీపీ నేతలు.. పురంధేశ్వరికి ఇచ్చారని , అందులో ఎవరెవరు కావాలో కూడా ఉందని ఆమె ఆరోపించారు.  లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ రావడానికి పురంధేశ్వరే కారణమన్నారు. కనీసం ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలనైనా చంపాలని వారు ప్లాన్ చేశారని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. కౌంటింగ్ నాటికి అంతా భయపడిపోయి ఏజెంట్లు ఎవరూ రారని , మా ఇష్టం వచ్చినట్లుగా చేసుకుంటామన్నట్లుగా వ్యవహరించారని లక్ష్మీపార్వతి ఆరోపించారు. 

వైసీపీ కేడర్ ఎవరి మీదకు తగవుకు పోలేదని, అన్ని చోట్లా తెలుగుదేశం గుండాలేనని ఆమె మండిపడ్డారు. హత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తిని చింతమనేని ప్రభాకర్ ఏకంగా పోలీస్ స్టేషన్‌కు వచ్చి వాళ్లని బెదిరించి తీసుకెళ్లిపోయాడని లక్ష్మీపార్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వెదవలని పెంచి పోషిస్తున్న చంద్రబాబు, పురందేశ్వరి ఇద్దరూ హంతకులేనని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. 

Comments